janamvoice.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 4:23 pm Digital Edition : GATTU MAHESH

సక్సెస్ ఇచ్చే కిక్ కోసమే సమిష్టి కృషి.-సీఎం చంద్రబాబు.

సక్సెస్ ఇచ్చే కిక్ కోసమే సమిష్టి కృషి.

పాలనలో వేగం పెంచాలి: సీఎం చంద్రబాబు
14వ ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక దిశానిర్దేశం
బ్రాండ్ ఏపీ పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి.

జనం వాయిస్, అమరావతి:

“సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది. ఆ కిక్ కోసమే మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. పాలనలో వేగాన్ని పెంచి ప్రజలకు వేగంగా సుపరిపాలన ఫలాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. 2025లో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) 14వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి సమష్టి కృషితోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దెబ్బతిన్న ‘బ్రాండ్ ఏపీ’ని తిరిగి నిలబెట్టగలిగామని స్పష్టం చేశారు. 2025లో రాష్ట్రం కోసం మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేశారని సీఎం ప్రశంసించారు. టీమ్‌వర్క్ ఫలితంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్రంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం ప్రత్యేకంగా వివరించారు. విద్యుత్ ఛార్జీలను 13 పైసలు తగ్గించినట్లు, ప్రజలపై రూ.4,500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కి తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కృషి వల్లే రాష్ట్రానికి డేటా సెంటర్లు వస్తున్నాయని, దావోస్ పర్యటన ద్వారా ఏపీ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయగలిగామని అన్నారు. గూగుల్ సెంటర్‌ను రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని అభినందించారు. ఈ 14వ ఎస్‌ఐపీబీ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు సంబంధించిన పలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపినట్లు అధికారులు గుర్తుచేశారు.