janamvoice.com
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 3:15 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణ డిజిటల్ క్యాబినెట్‌కు ఆమోదం.

తెలంగాణ డిజిటల్ క్యాబినెట్‌కు ఆమోదం.

పేపర్‌లెస్ పాలనకు ప్రభుత్వం కీలక నిర్ణయం.
మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌ల పంపిణీ.
డిజిటల్ విధానాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 18:

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు అధికారికంగా ఆమోదం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇకపై మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, అంశాలు, నివేదికలు, ప్రతిపాదనలు అన్నీ డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయి. దీంతో కాగితాల వినియోగం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. ఈ ట్యాబ్‌ల ద్వారా మంత్రులు సమావేశాలకు సంబంధించిన అన్ని వివరాలను సులభంగా పరిశీలించవచ్చు. ఆధునిక సాంకేతికత వినియోగంతో నిర్ణయాల ప్రక్రియ మరింత వేగవంతం కానుందని అధికారులు తెలిపారు.
డిజిటల్ క్యాబినెట్ అమలు విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ట్యాబ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం, ఎజెండా ప్రదర్శన, డిజిటల్ నిర్వహణ విధానంపై ఆయన అధికారులతో చర్చించారు. వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా అవసరమైన సూచనలు చేశారు.
ఈ-బుక్ విధానం ద్వారా మంత్రులకు క్యాబినెట్ సమావేశాలకు సంబంధించిన అన్ని అంశాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సమాచార మార్పిడి సులభతరం కావడంతో పాటు సమయం, వ్యయం కూడా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ నిర్ణయం దోహదపడనుంది. పేపర్‌లెస్ గవర్నెన్స్ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో డిజిటల్ క్యాబినెట్ ఒక ముఖ్యమైన ముందడుగుగా అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపాలనలో విస్తృతంగా వినియోగిస్తూ పారదర్శక, సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.