పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల.
జూన్ 5 నుంచి అదనపు పరీక్షలు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు వెల్లడి.
ఫీజు చెల్లింపుకు మే 14 వరకు అవకాశం.
జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 29:
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇక ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మార్కుల లెక్కింపులో లోపాలుంటే సరిచేసుకునేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రీకౌంటింగ్ కోసం ఒక సబ్జెక్టుకు రూ.500 ఫీజు ఉండగా, రీవెరిఫికేషన్ కోసం ఒక సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ అవసరాన్ని బట్టి ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయంతో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం లభించినట్లయింది. సమయానికి ఫీజు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.