janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 12:42 am Digital Edition : JANAM VOICE

వెంకటేశ్‌తో గ్యాప్‌కు అదే కారణం.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన రోజా!

వెంకటేశ్‌తో గ్యాప్‌కు అదే కారణం.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన రోజా!

  • ‘పోకిరి రాజా’ సినిమా సమయంలో వెంకటేశ్‌తో గ్యాప్ ఏర్పడిందన్న‌ రోజా.
  • కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ‘రాజా’ సినిమా కోల్పోయానని వెల్లడి.
  • యూనిట్ సభ్యులు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని అనుమానం.
  • మంత్రి అయ్యాక కలిస్తే ‘యు డిజర్వ్ ఇట్’ అని వెంకీ అభినందించారని వెల్లడి.

జనం వాయిస్, సినిమా, సెప్టెంబర్ 20:

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత రాజకీయ నాయకురాలు రోజా.. విక్టరీ వెంకటేశ్‌తో తనకున్న ప్రొఫెషనల్ గ్యాప్‌పై తొలిసారిగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 90వ దశకంలో తమది హిట్ కాంబినేషన్ అయినప్పటికీ, ఒక చిన్న అపార్థం వల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పోకిరి రాజా’ సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనే దీనికి మూలకారణమని రోజా వివరించారు.

ఆమె చెప్పిన దాని ప్రకారం.. ‘పోకిరి రాజా’ చిత్రంలో వారిద్దరిపై ఇద్దరిపై చిత్రీకరించిన ఒక పాట ఫిల్మ్ ల్యాబ్‌లో పాడైపోయింది. దీంతో ఆ పాటను రీషూట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తన భర్త సెల్వమణి పుట్టినరోజు ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్‌ను గౌరవించి రోజా ప్రత్యేకంగా కాల్షీట్లు కేటాయించారు.

అయితే, షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక రెండు రోజుల పాటు తనపై ఎలాంటి చిత్రీకరణ చేయకుండా ఖాళీగా కూర్చోబెట్టారని, ఇది తనను తీవ్రంగా అవమానించినట్లు అనిపించిందని రోజా గుర్తుచేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, కోపంతో బ్యాగ్ సర్దుకుని సెట్స్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.

అయితే, చిత్ర యూనిట్ సభ్యులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్ ‌కు తనపై తప్పుడు సమాచారం చేరవేసి ఉండవచ్చని రోజా అభిప్రాయపడ్డారు. దీనికితోడు దర్శకుడు సెల్వా సినిమాకు డేట్స్ సర్దుబాటు చేయాల్సివచ్చిందని, దీంతో మధ్యవర్తులు తప్పుడు ప్రచారం చేయడంతో తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్నారు.

ఈ అపార్థం ఫలితంగానే తమిళంలో విజయవంతమైన ‘ఉన్నిడతిల్ ఎన్నై కొడుత్తేన్’ తెలుగు రీమేక్ ‘రాజా’లో తన స్థానంలో సౌందర్యను తీసుకున్నారని రోజా వెల్లడించారు.

అయితే, ఈ విషయంపై వెంకటేశ్‌తో నేరుగా మాట్లాడి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదని, నిజం ఎప్పటికైనా తెలుస్తుందనే నమ్మకంతో మౌనంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత వెంకీతో కలిసి నటించకపోయినా, కెరీర్ మొదట్లో సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘సర్పయాగం’ వంటి చిత్రాలు చేశానని గుర్తుచేశారు.

ఎన్ని అపోహలు ఉన్నా, వెంకటేశ్‌ ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని రోజా అన్నారు. తాను మంత్రి అయిన తర్వాత ఒకసారి విమానంలో కలిసినప్పుడు, వెంకటేశ్‌ ఎంతో గౌరవంగా ‘యు డిజర్వ్ ఇట్’ అంటూ తన శ్రమను గుర్తించి మనస్ఫూర్తిగా ప్రశంసించారని ఆమె ఆనందంగా పంచుకున్నారు. వృత్తిపరంగా దూరం ఉన్నా, వ్యక్తిగతంగా వెంకటేశ్‌ ఎంతో సంస్కారవంతుడని రోజా ప్రశంసించారు.