ఏజెన్సీ ఎస్సీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో గళమెత్తాలి.
– డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్.
జనం వాయిస్, ఏన్టీపిసి:
తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హక్కులపై కొనసాగుతున్న అన్యాయాన్ని ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాలని ఏజెన్సీ ఎస్సీల హక్కుల పోరాట ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్, సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలకు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, నివాస, సాగు భూములపై హక్కులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ కారణంగా ఏజెన్సీ ఎస్సీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలంటే గిరిజన ప్రాంతాలేనన్న పేరుతో అక్కడి ఎస్సీల ఉనికిని విస్మరించడం సరికాదన్నారు. తరతరాలుగా ఏజెన్సీల్లో నివసిస్తూ వ్యవసాయం, కూలి పనులపై ఆధారపడుతున్న ఎస్సీలకు భూమి హక్కులు లేకపోవడం వల్ల అభివృద్ధి ఫలాలు దక్కడం లేదని చెప్పారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఏజెన్సీ ఎస్సీలకు రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. లేనిపక్షంలో ఏజెన్సీ పరిధిలోని 18 నియోజకవర్గాల ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ఎస్సీల సమస్యను పరిష్కరించకుండా సామాజిక న్యాయం, సమానత్వం సాధ్యం కాదని డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ స్పష్టం చేశారు.