janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 5:15 pm Digital Edition : JANAM VOICE

సింగరేణి కార్మికుల ‘సొంతింటి’ కలకు అసెంబ్లీ వేదికగా అడుగు.

సింగరేణి కార్మికుల ‘సొంతింటి’ కలకు అసెంబ్లీ వేదికగా అడుగు.

• కార్మికుల డిమాండ్‌ను అసెంబ్లీలో ప్రస్తావించనున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్.

• చొరవను స్వాగతించిన సీఐటీయూ.

• ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు: తుమ్మల రాజారెడ్డి.

జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 15:

సింగరేణి కార్మికుల దశాబ్దాల స్వప్నమైన ‘సొంతింటి సహకారం’ పథకానికి అసెంబ్లీ వేదికగా మరోసారి బలమైన ప్రస్తావన రానుంది. కార్మికుల సమస్యను శాసనసభలో ప్రస్తావించేందుకు ముందుకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సీఐటీయూ గత ఐదేళ్లుగా సింగరేణి కార్మికులకు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలనే డిమాండ్‌తో నిరంతర పోరాటం చేస్తోందని తుమ్మల రాజారెడ్డి తెలిపారు. కార్మికుల వినతిని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించేందుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు.

యాజమాన్యంపై ఆర్థిక భారం లేకుండానే..

సొంతింటి పథకం అమలైతే సింగరేణి యాజమాన్యంపై అదనపు ఆర్థిక భారం పడకుండా కార్మికులకు ప్రయోజనం కల్పించే విధంగా ప్రతిపాదన రూపొందించినట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. క్వార్టర్లు లేని కార్మికులకు లభించే హెచ్‌ఆర్‌ఏను, రాష్ట్ర ప్రభుత్వం అందించే వడ్డీలేని రుణ సహాయంతో అనుసంధానం చేసి సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వానికీ ప్రయోజనమే..

కార్మికులు సొంత ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తే రిజిస్ట్రేషన్లు, విద్యుత్ కనెక్షన్లు, మున్సిపల్ పన్నులు తదితర రూపాల్లో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందని తుమ్మల రాజారెడ్డి తెలిపారు. అంతేకాకుండా కార్మికులు సింగరేణి ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల స్థానిక వ్యాపారాలు, పట్టణాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని అన్నారు.

హామీ అమలుకు ముందడుగు..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, అందులో సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తుమ్మల రాజారెడ్డి కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతున్న ఎమ్మెల్యేకు సింగరేణి కార్మికుల మద్దతు ఉంటుందని సీఐటీయూ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కుంట ప్రవీణ్‌కుమార్, వంగల శివరాంరెడ్డి, అంబాల శ్రీనివాస్, తోట నరహరిరావు, సోమారపు వెంకన్న, ఎద్దు కుమార్, ఎస్‌కే గౌస్, శ్రీహరి, ఎడ్ల వెంకటేష్, సురేష్, వినేష్, అహ్మద్ పాషా, గుగులోత్ రామకృష్ణ, కొమ్మ రమేష్, జంగ సమ్మయ్య, బుద్ధర్తి సంతోష్, తుమ్మ లక్ష్మణ్, కుమారస్వామి, బుర్ర శ్రీనివాస్, పోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.