janamvoice.com
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 12:10 pm Digital Edition : JANAM VOICE

పండుగల వేళ పేదలపై ధరల భారం తగ్గించాలి.

పండుగల వేళ పేదలపై ధరల భారం తగ్గించాలి.

  • బతుకమ్మ, దసరా సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి.
  • చౌక ధరల దుకాణాల ద్వారా ప్రత్యేక పండుగ కిట్లు పంపిణీ చేయాలి.
  • ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు తగ్గించి ప్రయాణికులకు ఊరట కల్పించాలి.
  • డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ డిమాండ్.

జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 11:

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పండుగ ఖర్చులు సామాన్య కుటుంబాలకు మోయలేని భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్లలోనూ పండుగ సంతోషాలు వెల్లివిరిసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా పంచదార, పప్పు దినుసులు, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన ప్రత్యేక పండుగ కిట్లను రాయితీ ధరలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఆర్థిక ఊరట కల్పించాలన్నారు. మరోవైపు పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై అదనపు చార్జీల భారం మోపడం సరికాదన్నారు. పండుగ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీల కంటే 50 శాతం అధికంగా వసూలు చేస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం సమీక్షించి చార్జీలను తగ్గించాలని కోరారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు కేవలం సంపన్నులకే పరిమితం కాకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఆనందాన్ని నింపేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని తోట రంగయ్య, ఆళవందార్ వేణు మాధవ్ డిమాండ్ చేశారు.