janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:25 am Digital Edition : GATTU MAHESH

ఆదిలాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించిన ముఖ్యమంత్రి.

ఆదిలాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించిన ముఖ్యమంత్రి.

– బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం.
– నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, భారీ పారిశ్రామిక వాడ.
– “పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి”.

జనం వాయిస్, నిర్మల్:

తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విస్తృత ప్రణాళికను ప్రకటించారు. బాసరలోని ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, తాగు మరియు సాగునీటి అవసరాల కోసం తుమ్మిడిహెట్టి వద్ద చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ. 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సినంత అభివృద్ధి, నీటి వనరులు గతంలో అందలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని మార్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
పాలమూరు జిల్లాకు ఇచ్చిన ప్రాధాన్యతను అదే స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. చనాక–కొరాట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అంశంపై నీటి పారుదల శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పదేళ్లుగా చనాక–కొరాట ప్రాజెక్టు పూర్తి కాలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. సరస్వతీ ఆలయం ఉన్న బాసర ఐఐఐటీలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ ఎక్కడ అన్న చర్చలతో కాలం వృథా చేయకుండా బాసరలోనే ఏర్పాటు చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడ అభివృద్ధి చేసి దేశంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడ స్థాపించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం పది వేల ఎకరాల భూమి సేకరణ అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమని, కానీ ఇప్పుడు ప్రజల కోసం కలిసిమెలిసి పనిచేయాల్సిన సమయమని అన్నారు. ఎర్ర బస్సు కూడా రాని పరిస్థితి నుంచి ఎయిర్ బస్ వచ్చే స్థాయికి ఆదిలాబాద్‌ను తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లే, పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో, ఆ మరుసటి రోజు అధికార యంత్రాంగంతో జిల్లా ఇంచార్జీ మంత్రి సమీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి బడ్జెట్ సమావేశాల్లో అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.
తుమ్మిడిహెట్టి వద్ద గతంలో ప్రతిపాదిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తప్పనిసరిగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డీపీఆర్ సిద్ధమవుతోందని, మహారాష్ట్ర నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో ప్రధానమంత్రి సహకారం లభిస్తే ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగోబా జాతర అభివృద్ధికి రూ. 22 కోట్లు మంజూరు చేస్తామని, అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మందిరాన్ని కుంభమేళా స్థాయిలో అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 300 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. “మేము పాలకులం కాదు, సేవకులం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ, ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ అభివృద్ధి పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.