janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 4:12 pm Digital Edition : GATTU MAHESH

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం.

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం.

– పది రోజుల పాటు కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ.

– కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ.

జనం వాయిస్, హనుమకొండ, ఫిబ్రవరి 5:

ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపునకు దాదాపు పది రోజుల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతర గత నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరిగింది. జాతర సమయంలోనే కాకుండా ముందు, తరువాత కూడా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. ఈ రోజు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి అధికారికంగా హుండీల లెక్కింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. జాతరకు తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు నగదు, బంగారం, వెండి, ఇతర కానుకలను హుండీల్లో సమర్పించారు. గతసారి మేడారం మహా జాతరకు హుండీల ద్వారా సుమారు రూ.13 కోట్ల ఆదాయం సమకూరిన సంగతి తెలిసిందే. ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భక్తుల విశ్వాసంతో సమకూరే కానుకల లెక్కింపును పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడతామని, లెక్కింపు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.