janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 1:13 pm Digital Edition : JANAM VOICE

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి.

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి.

828 హుండీలతో రూ.13.25 కోట్ల ఆదాయం – విదేశీ కరెన్సీ, బంగారం, వెండి లభ్యం.

జనం వాయిస్, హనుమకొండ, ఫిబ్రవరి 12:

ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మొత్తం 828 హుండీలను తెరిచి నగదు, ఆభరణాలను లెక్కించారు. వారం రోజుల పాటు సుమారు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లెక్కింపు చేపట్టారు. మొత్తం రూ.13,25,83,269 ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. హుండీల్లో నగదుతో పాటు విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు కూడా లభించాయి. గత మహాజాతరలో 540 హుండీల ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం నమోదవగా, ఈసారి 828 హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు సమాన స్థాయిలోనే ఆదాయం రావడం విశేషం. హుండీల సంఖ్య గణనీయంగా పెరిగినా ఆదాయం పెరుగుదల పరిమితంగానే ఉండటం గమనార్హమని అధికారులు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో లక్షలాది మంది పాల్గొనగా, హుండీ ఆదాయం కూడా భారీ స్థాయిలో నమోదవడం దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడనుంది. లభించిన నగదు, ఆభరణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.