మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా కదలిరావాలి: మంత్రి కొండా సురేఖ.
జనం వాయిస్, హనుమకొండ, జూలై 12:
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌జేయూ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించనున్న ‘సే నో టు డ్రగ్స్’ 2కే అవగాహన ర్యాలీ పోస్టర్‌ను మంత్రి కొండా సురేఖ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మీడియా, విద్యాసంస్థలు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. సామాజిక బాధ్యతతో టీఎస్‌జేయూ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. టీఎస్‌జేయూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలపై నిరంతర అవగాహన ద్వారానే యువతను రక్షించగలమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు జర్నలిస్టులు తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జిల్లా కోశాధికారి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, జూలై 23న నిర్వహించే 2కే ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌జేయూ రాష్ట్ర, జిల్లా నాయకులు వేణు , నగేష్ గౌడ్ , నరేష్ గౌడ్ , వరంగల్ జిల్లా కమిటీ ఈద శ్రీనాథ్ ,నాగపురి అవినాష్ , కౌడగాని మోహన్ రావు ,తదితరులు పాల్గొన్నారు.
