janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 12:40 pm Digital Edition : JANAM VOICE

సంతా.. మా ఊరి సంతా..!పశువుల సంత.. తైబజార్‌లో సౌకర్యాలు కరువు.

సంతా.. మా ఊరి సంతా..!

  • పశువుల సంత.. తైబజార్‌లో సౌకర్యాలు కరువు.
  • ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. రైతులు, వ్యాపారులకు సౌకర్యాలపై లేదా?.
  • సంత ఆదాయం అరకోట్లు.. సౌకర్యాలు మాత్రం ఎక్కడ?.
  • చినుకు పడితే చిత్తడే.. సంతనా? చిన్న కుంటలా?.
  • తాగునీరు.. మరుగుదొడ్లు కరువు.. మహిళల అవస్థలు.
  • మూగజీవాల పరిస్థితి ఏమిటి..? అధికారుల పర్యవేక్షణ ఏది?.
  • కురవి, సెప్టెంబర్ 14 (జనం వాయిస్) :
  • ప్రజా కవి గోరేటి వెంకన్న పాడిన “సంతా మా ఊరు సంతా” పాటను తలపించేలా మహబూబాబాద్ జిల్లా కురవి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి సోమవారం పశువుల సంత, తైబజార్ నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు వివిధ గ్రామాల నుంచి రైతులు, పశువుల యజమానులు, వ్యాపారులు సంతకు తరలివస్తుంటారు. అయితే సంత ద్వారా గ్రామ పంచాయతీకి గణనీయమైన ఆదాయం వస్తున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • సంత ఆదాయం అరకోటి.. సౌకర్యాలు మాత్రం ఎక్కడ?

ప్రతి ఏడాది సంత, తైబజార్ నిర్వహణ ద్వారా గ్రామ పంచాయతీకి సుమారు అరకోటి వరకు ఆదాయం వస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కానీ రైతులు, వ్యాపారులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆదాయం వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చినుకు పడితే చిత్తడే.. సంతనా? చిన్న కుంటలా?
వర్షం పడితే సంత ప్రాంగణం మొత్తం బురదమయంగా మారి, వర్షపు నీరు నిలిచిపోయి చిన్న కుంటలను తలపిస్తోందని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. పశువులను తీసుకొచ్చే రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అసౌకర్యం కారణంగానే ప్రతి ఏడాది సంత టెండర్ ఆదాయం తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు.

తాగునీరు.. మరుగుదొడ్లు కరువు.. మహిళల అవస్థలు.

వివిధ గ్రామాల నుంచి సంతకు వచ్చే మహిళలకు కనీసం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. గంటల తరబడి సంతలో ఉండే రైతులు, వ్యాపారులు ఎండలో, వానలోనే కాలం గడపాల్సి వస్తోంది. మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

మూగజీవాల పరిస్థితి ఏమిటి..? అధికారుల పర్యవేక్షణ ఏది?

పశువుల సంతకు పెద్ద సంఖ్యలో పశువులు వస్తున్నప్పటికీ వాటికి తాగునీరు, నీడ, నీటి తొట్టెలు వంటి సౌకర్యాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశువుల ఆరోగ్య పరీక్షలు, పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులు, పాలకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారా అనే దానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఆదాయంపై శ్రద్ధ.. సౌకర్యాలపై ఎందుకు లేదు?

తైబజార్, పశువుల సంత పేరుతో వసూలు చేస్తున్న రుసుములకు నిబంధనల ప్రకారం టెండర్ విధానం ఎలా జరిగింది? ఎంత ఆదాయం వస్తోంది? ఆ ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? అనే వివరాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలోనూ చూపించాలని కోరుతున్నారు.

ఇకనైనా మేల్కొంటారా..?

కురవి పశువుల సంత, తైబజార్‌ను అధికారులు, పాలకులు తక్షణమే పరిశీలించి తాగునీరు, మరుగుదొడ్లు, డ్రైనేజీ, షెడ్లు, నీడ, పశువులకు నీటి తొట్టెలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు. సంత ద్వారా వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపట్టి, ఆదాయ–వ్యయ వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందిస్తారా.. లేక “సంతా మా ఊరి సంతా” సమస్యల సంతగానే మిగిలిపోతుందా..? వేచి చూడాల్సిందే.

అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలి.

ఒకప్పుడు కోట్ల రూపాయల ఆదాయం అందించిన కురవి పశువుల సంత ప్రస్తుతం కేవలం రూ.30.40 లక్షల ఆదాయానికి పడిపోయిందని సీపీఐ కురవి టౌన్ కార్యదర్శి తురక రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంత అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. “ఆదాయం ఎందుకు ఇంతగా పడిపోయిందో ఆ వీరభద్రస్వామికే తెలుసు. ఇకనైనా పశువుల సంతను అభివృద్ధి చేసి రైతులు, వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి” అని తురక రమేష్ డిమాండ్ చేశారు.