ప్రభుత్వాన్ని మెల్కొల్పి ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుండాలే.!
– వ్యక్తిగతం కంటే యూనియన్‌గా ఉంటేనే ప్రయోజనం.
– ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్‌క్లబ్‌కు నావంతు సహకారం అందిస్తా.
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
జనం వాయిస్, మంథని:
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రభుత్వాన్ని మేల్కొల్పి ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుండాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథని డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రెస్‌క్లబ్‌ను ఆయన సందర్శించి నూతన కమిటిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతం కంటే యూనియన్‌గా ఉండటంతో అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. తనకు సైతం అందరూ ఐక్యంగా ఉండాలని, కలిసి ఉండటం అంటేనే తనకు చాలా ఇష్టమన్నారు. అయితే దేశంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దేశంలో నాలుగో స్థంభంగా పేరున్న మీడియా ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా సరైన రీతిలో స్పందించేలా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా చాలా వేగంగా ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గం విస్తీర్ణంలో చాలా పెద్దదని, ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, పత్రికలు మీడియా అలసత్వం వహించవద్దని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రెస్‌క్లబ్‌కు తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, అలాగే బీఆర్‌ఎస్ పార్టీ సైతం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.