janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 3:11 pm Digital Edition : JANAM VOICE

సంక్షేమ పథకాల ప్రచారంలో సమాచార శాఖను తీర్చిదిద్దాలి.

సంక్షేమ పథకాల ప్రచారంలో సమాచార శాఖను తీర్చిదిద్దాలి.

– తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం.

జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 28:

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలంటే సమాచార పౌర సంబంధాల శాఖ తన ప్రచార శైలిని మరింత ఆధునీకరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం అన్నారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టీఎస్జేయూ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా నారగౌని పురుషోత్తం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార శాఖది కీలక పాత్ర అని నొక్కి చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి, ప్రచార విభాగాలను బలోపేతం చేయడం ద్వారా పథకాల లబ్ధిని ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన ముకుంద రెడ్డి నేతృత్వంలో శాఖ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారంపై కూడా కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ముత్యం ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొని కమిషనర్‌ను ఘనంగా సన్మానించారు.