విహారయాత్ర ఆనందం క్షణాల్లో విషాదం.
– శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా.
– పలువురు విద్యార్థులకు గాయాలు.
జనం వాయిస్, శంషాబాద్, డిసెంబర్ 25:
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌కు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జలవిహార్కు విహారయాత్రకు బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా శంషాబాద్ వద్దకు చేరుకున్న సమయంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసి, గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రులకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు బోల్తా పడటంతో శంషాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.