janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:33 am Digital Edition : GATTU MAHESH

‘చేయి వీడని చెలిమి’ నవల ఆవిష్కరణ.

‘చేయి వీడని చెలిమి’ నవల ఆవిష్కరణ.

– ప్రతిభతో వైకల్యాన్ని జయించిన సాయిజ్యోతి.
– మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా పుస్తక ఆవిష్కరణ.
– యువతకు స్ఫూర్తిగా నిలిచిన రచయిత్రి.

జనం వాయిస్, ఉండవల్లి:

మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ నవలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సాయిజ్యోతి మంత్రి లోకేష్‌ను కలిశారు.
అంధురాలైన సాయిజ్యోతి మొబైల్‌లో వాయిస్ ఇన్‌పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రచనలు చేస్తున్నారు. ‘చైత్రశ్రీ’ కలం పేరుతో కవితాంజలి అనే కవితా సంపుటితో పాటు ‘మంచుతాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ అనే నవలలు, సామాజిక స్పృహ కలిగించే కథలు రచించి పాఠకుల మన్నన పొందారు. సాహిత్య రంగంలో ఆమె నిరంతర కృషి ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నూతక్కి హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిజ్యోతి, తన వైకల్యాన్ని జయించి ప్రతిభతో ముందుకు సాగుతూ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని నారా లోకేష్ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని సాహిత్య విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.