సంక్రాంతి సంబరం బాక్సాఫీస్‌కి పండుగే.
– 5 సినిమాలు కలిసి 500 కోట్లకు పైగా దూసుకెళ్లాయ్..!
జనం వాయిస్, సినిమా:
2026 సంక్రాంతి టాలీవుడ్‌కు అసలైన బంగారు పండుగలా మారింది. ఏకంగా ఐదు భారీ సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ప్రేక్షకుల రద్దీతో టికెట్లకు డిమాండ్ పెరిగి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. స్టార్ హీరోల క్రేజ్, యూత్ ఎంటర్‌టైన్మెంట్, ఫ్యామిలీ వినోదం కలిసి ఈసారి సంక్రాంతిని రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటివరకు మొత్తం వసూళ్లు 500 కోట్లకు పైగా చేరడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రాజా సాబ్ చిత్రం జనవరి 9న విడుదలై మొదటి వారంలోనే సుమారు 238 కోట్ల వసూళ్లను రాబట్టింది. మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ ప్రభాస్ అభిమానుల క్రేజ్ సినిమాను ముందుకు నడిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మార్కును దాటింది. దేశీయంగా కూడా సుమారు 120 కోట్ల గ్రాస్ సాధించింది.
మాస్ రాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం తీవ్ర పోటీ మధ్య కూడా నిలదొక్కుకుంటోంది. మొదటి 4 రోజుల్లోనే సుమారు 8.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం యూత్ మరియు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 42 కోట్ల గ్రాస్ సాధించింది.
శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి చిత్రం తక్కువ థియేటర్లలో విడుదలైనా మౌత్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. మొదటి 3 రోజుల్లో సుమారు 5.8 కోట్ల గ్రాస్ వసూలు చేసి స్థిరంగా ముందుకెళ్తోంది. మొత్తం మీద ఐదు సినిమాల కలిపి వసూళ్లు 500 కోట్లకు పైగా చేరడం టాలీవుడ్ చరిత్రలో అరుదైన ఘనతగా నిలుస్తోంది. థియేటర్లు తక్కువగా ఉన్నప్పటికీ మంచి కథా బలం ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.