ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నిరుపేదల పోరాటం.. రెండో రోజుకు చేరిన దీక్షలు.
– మంద కొమురమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాల్సిందే.
– సింగరేణి యాజమాన్యం అడ్డుకోవడం అన్యాయం: ఎంఆర్‌పీఎస్ నాయకులు.
జనం వాయిస్, గోదావరిఖని, ఏప్రిల్ 12:
మంద కొమురమ్మ కాలనీ నిరుపేదలకు నివాస స్థలాల పట్టాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ నాయకులు రాసపల్లి రవికుమార్, కాసిపేట రాజయ్య మాట్లాడుతూ.. నిరుపేదలు ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే సింగరేణి యాజమాన్యం అడ్డుపడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. జీఎం ఆఫీస్ వెనుక ఉన్న ప్రభుత్వ భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటుంటే అధికారులు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు సొంత ఇళ్లు లేక అద్దె గదుల్లో మగ్గుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే, మేయర్ ఇచ్చిన హామీ ప్రకారం ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం కింద వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పోరాటం నిరుపేదలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని, అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దశరథం, ధర్మేందర్,మంద రవి,పల్లె బాబు, రాంబాబు రొంటల రాధ,కొండ్ర అరుణ,అంబాల అర్చన,అడ్డూరి అంజలి,మైస సారమ్మ,అవునూరి గౌరి,మచ్చ సుజాత,సతూరి కృష్ణ,ఈర్ల రవి,మామిడి స్వామి, కాలనీ వాసులు పాల్గొన్నారు.