janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 3:43 pm Digital Edition : GATTU MAHESH

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం క్షమించరాని మహాపాపం.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం క్షమించరాని మహాపాపం.

భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు.

దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు : సీఎం చంద్రబాబు

జనం వాయిస్, ఉండవల్లి, ఫిబ్రవరి 5:

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టి, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. ఇది క్షమించరాని మహాపాపమని, దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకోవడం అత్యంత ప్రమాదకరమని చంద్రబాబు స్పష్టం చేశారు. కల్తీ జరగలేదని కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నివేదికల్లో ఎక్కడా కల్తీ లేదని చెప్పలేదని, అయినా నిజాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. దేవుని పవిత్రతకు భంగం కలిగితే ముక్తకంఠంతో ఖండించాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందన్నారు. ఈ దోషులకు కఠిన శిక్ష తప్పదని, ఏకసభ్య కమిషన్‌తో సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న అన్ని నివేదికలను కమిషన్ ముందు ఉంచుతామని, అవసరమైతే న్యాయస్థానంలో అదనపు వివరాలు సమర్పిస్తామని తెలిపారు.
వైసీపీ నేతలకు దేవుడిపై విశ్వాసం లేకపోవచ్చని, కానీ విశ్వాసం ఉన్న కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు హెచ్చరించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే కందిరీగల కారణమని చెప్పడం, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసమైతే ‘అదో బొమ్మే కదా’ అంటూ మాట్లాడటం వంటి ఘటనలను గుర్తుచేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎవరూ తిరుమల స్వామివారి పవిత్రతను దెబ్బతీయలేదని, బ్రిటిష్ పాలకులు సైతం స్వామివారి సంప్రదాయాలను గౌరవించారని గుర్తు చేశారు. అలాంటిది గత పాలకులు చేసిన చర్యలు దుర్మార్గమైన అపచారమని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనతో పాటు దైవ కార్యాల ప్రక్షాళనకు ప్రాధాన్యం ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు తిరుమల ప్రక్షాళన కోసం చర్యలు తీసుకున్నానని, కల్తీ అనుమానంతో నెయ్యి నమూనాలను జాతీయ స్థాయి సంస్థకు పంపించామని చెప్పారు. ఆ నివేదికలోనే కల్తీ వాస్తవాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం కొత్తది కాదని, రెండు వేల ఇరవై రెండులోనే అప్పటి ప్రభుత్వానికి కల్తీపై నివేదిక అందిందని చంద్రబాబు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ నివేదికను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించారని ఆరోపించారు. ప్రస్తుత విచారణలో మరింత భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయని, నెయ్యి తయారీలో ప్రమాదకర పదార్థాలు, జంతువుల కొవ్వు కూడా వాడినట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై దాడులు పరాకాష్టకు చేరాయని చంద్రబాబు విమర్శించారు. దేవుడి పవిత్రతను కాపాడటం తన బాధ్యత అని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.