తిరుమలలో ఉత్సవాల రద్దీకి వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత.
-డిసెంబర్–జనవరిలో పర్వదినాల సందర్భంగా కీలక నిర్ణయం.
-వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉండబోవని టీటీడీ స్పష్టం.
జనం వాయిస్, తిరుమల, డిసెంబర్ 10:
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ మరియు జనవరి నెలల్లో వరుసగా జరిగే పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 23న జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, డిసెంబర్ 29న ప్రత్యేక పర్వదినాలు, అలాగే భారీగా భక్తులు వచ్చే సందర్భాలను గుర్తించి దర్శనాల వ్యవస్థలో తాత్కాలిక మార్పులు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ ప్రకటించింది. ఈ కాలంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల వీఐపీ బ్రేక్ దర్శనాలను కొనసాగించడం సాధ్యంకాదని తెలిపింది. అలాగే జనవరి 25న రథసప్తమి సందర్భంగా ప్రోటోకాల్‌కు చెందిన ప్రముఖులకు మాత్రమే దర్శనావకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తేదీల్లో సిఫారసు లేఖల ఆధారంగా బ్రేక్ దర్శనాలు అనుమతించబోమని టీటీడీ పేర్కొంది. భక్తులు దర్శన వ్యవస్థలో మార్పులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలంటూ టీటీడీ విజ్ఞప్తి చేసింది. భారీ జనసంద్రం కారణంగా సిఫారసు లేఖలను స్వీకరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుతారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఏ రకమైన అసౌకర్యం లేకుండా దర్శనాలను నిర్వహించడం టీటీడీ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇక శ్రీవారికి విరాళాల విషయంలో భక్తులు చూపుతున్న విశ్వాసం కొనసాగుతోంది. తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరఫున అర్జున్ కొల్లికొండ రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ ఈ–సీ3 ఎలక్ట్రిక్ కారు విరాళంగా అందించారు. చెన్నైకి చెందిన శరవణన్ కరుణాకరన్ కూడా రూ.9 లక్షల విలువైన మరో సిట్రాయెన్ కారును విరాళంగా ఇచ్చారు. శ్రీవారి ఆలయం ఎదుట ఈ కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందజేశారు.