janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 9:53 pm Digital Edition : GATTU MAHESH

దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇదే.-ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇదే.

– పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం.
– తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం.
– మీ విజయం సరికొత్త మార్పుకు నాంది కావాలి.
– ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

జనం వాయిస్, కొండగట్టు, జనవరి 03:

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ సర్పంచులు, వార్డు మెంబర్లతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. శనివారం కొండగట్టు పర్యటనలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన విజేత అభ్యర్థులకు పేరు పేరునా అభినందనలు తెలిపారు. పోటీ చేసిన సంఖ్యలో 50 శాతం విజయం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రస్థానం ప్రారంభించాలన్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించడం ద్వారా మీరు చాలా పెద్ద అడుగు వేశారని, ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని వ్యాఖ్యానించారు. ఈ రోజు మీరు వేసిన అడుగు సరికొత్త మార్పుకు నాంది కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 53 మంది అభ్యర్థులు విజయం సాధించారని, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇదేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయం సాధించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ నేల తనకు పోరాట స్ఫూర్తిని, రాజకీయ ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన అని, ఇక్కడి ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిదని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరమని, మీ స్థాయి, మీ ప్రాంతాన్ని బట్టి ప్రజల కోసం పోరాటం చేయాలని సూచించారు. సిద్ధాంత బలంతో సహజంగా ఎదిగితే విభేదించడం ఎవరికీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నానంటే తెలంగాణ అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తే కారణమని పవన్ కళ్యాణ్ తెలిపారు. రజాకార్లపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం తనకు ఎప్పటికీ ప్రేరణగా నిలిచిందన్నారు. సమయం, క్రమశిక్షణ ఉంటే రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవచ్చని విజేతలకు సూచించారు.
ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్, టీటీడీ ఎల్.ఏ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు, టీటీడీ బోర్డు సభ్యుడు బి. మహేందర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఆర్.కె. సాగర్, శ్రీమతి శిరీష తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలని, తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పనిచేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.