సంక్రాతి కి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.
హైదరాబాద్ విజయవాడ హైవే పై టోల్ ఫ్రీ..?
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 30:
నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వేళ స్వ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది, ఈ మేరకు నేషనల్ హైవే లపై వెళ్లే వారికి టోల్ ఖర్చులను పూర్తిగా తగ్గించే దిశగా ప్రణాళికను రచిస్తుంది తెలంగాణ ప్రభుత్వం…
పండుగ రోజుల్లో టోల్‌గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు.. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు మంగళ వారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిం దంటే చాలు.. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ప్రయాణికులకు టోల్ కష్టాలు తప్పడం లేదు
ముఖ్యంగా పంతంగి, కొర్లపహాడ్ చిల్లకల్లు వంటి టోల్ ప్లాజాల వద్ద వాహనా లు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నప్ప టికీ.. వాహనాల సంఖ్య లక్షల్లో ఉండటంతో ఒక్కో టోల్ ప్లాజా దాటడానికి గంటల సమయం పడుతోంది. పండుగకు వెళ్లే ఉత్సాహం లో ఉన్న సామాన్యులకు ఈ ట్రాఫిక్ జామ్‌లు నరకాన్ని చూపిస్తున్నాయి.
చంటిపిల్లలు, వృద్ధులతో ప్రయాణించే వారు ఈ రద్దీలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు ఏటా కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఈ జా తీయ రహదారిపై పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వివిధ చోట్ల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, వంతెనలు, సర్వీసు రోడ్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
నిర్మాణ పనుల కారణంగా రహదారిపై ఇప్పటికే అనేక చోట్ల మళ్లింపులు ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే వాహనాలు నెమ్మదిగా సాగుతుండగా.. ఇక పండుగ రద్దీ తోడైతే ట్రాఫిక్ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.