janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 3:03 pm Digital Edition : JANAM VOICE

తాగునీటికే తొలి ప్రాధాన్యం.. యాసంగిలో వరి సాగు వద్దు.

తాగునీటికే తొలి ప్రాధాన్యం.. యాసంగిలో వరి సాగు వద్దు.

  • సూపర్ ఎల్‌నినో ప్రభావంపై ఆరు నెలల కార్యాచరణ రూపొందించాలి.
  • ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి.
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా.

జనం వాయిస్, కరీంనగర్, అక్టోబర్ 17:

సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నాలుగు జిల్లాల కలెక్టర్లు గరీమ అగర్వాల్, బి. సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, చిత్ర మిశ్రాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని సూచించారు. యాసంగిలో నీటి కొరత దృష్ట్యా వరి సాగును తగ్గించి మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో ఆరు నెలల కార్యాచరణ రూపొందించి భూగర్భ జలాల పెంపునకు ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోరు రీఛార్జ్ పనులు చేపట్టాలన్నారు. విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షిస్తూ కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చూడాలని సూచించారు. మున్సిపాలిటీల్లో అమృత్ పనులను వేగవంతం చేయాలన్నారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం పంటలకు నీటి ఎద్దడి లేదని తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో 18.17 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.