పిల్లిగుండ్ల తండలో విషాదం.. తల్లీకుమారుడు మృతి.
… గేదెలను మేపేందుకు వెళ్లి కుంటలో పడి మృతి.
… ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్.
కురవి, ఆగస్టు 14 (జనం వాయిస్):
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండ గ్రామ శివారులో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొగిలిచర్ల రెడ్డి కుంటలో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. పిల్లిగుండ్ల తండాకు చెందిన భూక్య నవ్య (26), ఆమె కుమారుడు అన్వేష్ (9) మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవ్య, అశోక్ దంపతులకు కుమార్తె నిహారిక, కుమారుడు అన్వేష్ ఉన్నారు. గురువారం అశోక్ పనిమీద హైదరాబాద్‌కు వెళ్లగా, నవ్య తన కుమారుడు అన్వేష్‌తో కలిసి గేదెలను మేపేందుకు తండా సమీపంలోని కుంట వైపు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రమైనా తల్లి, కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, తండావాసులు ఆందోళనకు గురై వెతకడం ప్రారంభించారు. కుంట వద్దకు వెళ్లి పరిశీలించగా సెల్‌ఫోన్ రింగ్ అవుతున్నట్లు గుర్తించారు. అక్కడే ఫోన్ ఉండగా, సమీపంలో బాలుడి దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుంటలో గాలించారు. అనంతరం తల్లీకుమారుడు కుంటలో మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
గొడవల నేపథ్యంలో అనుమానాలు..
భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తండాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. తల్లి, కుమారుడు ప్రమాదవశాత్తు కుంటలో పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. భార్య, కుమారుడిని కోల్పోవడంతో అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారుడు మృతి చెందడం తండావాసులను తీవ్రంగా కలచివేసింది.