వీధి నిర్వహణలో ‘అనంత’ లోకాలకు.. డీటీఓ వెంకన్న విషాదాంతం..!
జనం వాయిస్, భూపాలపల్లి జూన్ 22:
చేతిలో రికార్డులు.. కళ్లలో బాధ్యత.. గుండె నిండా విధి నిర్వహణ పట్ల అంకితభావం. నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిని హెచ్చరిస్తున్న ఆ అధికారిని విధి ‘మృత్యుశకటం’ రూపంలో కబళించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న సోమవారం ఉదయం గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ లారీ ఆయన ప్రాణాలను గాల్లో కలిపేసింది.
• 15 రోజుల ముందే బదిలీ.. అంతలోనే అనంత లోకాలకు..!
కొత్త బాధ్యతలు.. కొత్త జిల్లా.. ఇక్కడి రవాణా వ్యవస్థను చక్కదిద్దాలనే తపనతో కేవలం 15 రోజుల క్రితమే వెంకన్న భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకుంటూ, రహదారి భద్రతను పర్యవేక్షించేందుకు స్వయంగా ఆయనే ఫీల్డ్‌లోకి దిగారు. పరకాల – భూపాలపల్లి హైవేపై వాహనాల తనిఖీ చేపడుతుండగా, మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్ లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. లారీ చక్రాల కింద నలిగి ఆ అధికారి మృతదేహం నుజ్జునుజ్జయిన తీరు చూసి స్థానికులు, తోటి సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు.
• నిలకడ లేని వేగానికి నిలువెత్తు సాక్ష్యం.
నిబంధనలు పాటించకుండా, మితిమీరిన వేగంతో రహదారులపై దూసుకెళ్లే భారీ వాహనాలు సామాన్యులనే కాదు.. చివరకు వాటిని నియంత్రించాల్సిన ఉన్నతాధికారుల ప్రాణాలను కూడా ఎలా బలితీసుకుంటున్నాయనే దానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.
• వెంకన్న కుటుంబంలో తీరని చీకటి.
ఈ ప్రమాదం ఒక అధికారిక సమాచారంగానో, ఒక వార్తాంశంగానో ముగిసిపోయేది కాదు. ఒక బాధ్యతాయుతమైన అధికారి వెనుక ఉన్న ఒక కుటుంబం, వారి ఆశలు, ఆశయాలు ఈ రోజు రోడ్డు పాలు అయ్యాయి. ఉదయాన్నే “విధులకు వెళ్లి వస్తా” అని చెప్పి వెళ్లిన యజమాని.. ఇలా నిర్జీవంగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయాడనే వార్త వినాల్సి రావడం ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. కేవలం రెండు వారాల క్రితమే కొత్త జిల్లాకు బదిలీ అయిన సంతోషం కూడా ఆవిరైపోకముందే, ఆ ఇంట్లో గుండెకోత మిగిలింది.
• రహదారి భద్రతపై హెచ్చరిక.
బొగ్గు రవాణా చేసే టిప్పర్ లారీల వేగం, ఇసుక లారీల వేగం డ్రైవర్ల నిర్లక్ష్యంపై ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డీటీఓ స్థాయి అధికారి ప్రాణాలే గాల్లో కలసిపోయాయంటే, సామాన్య ప్రయాణికుల భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నప్పటికీ, పోయిన ప్రాణాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేరు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డీటీఓ వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మా ‘జన వాయిస్’ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. రహదారులపై ఇకనైనా ఇటువంటి మృత్యుశకటాల వేగానికి అడ్డుకట్ట పడాలని ఆశిద్దాం.
