లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఖాకీలు.
– గంగారం పోలీస్ స్టేషన్‌లో ఘటన.
– వివాహేతర సంబంధం కేసులో డబ్బు డిమాండ్.
– ఎస్సై, కానిస్టేబుల్ అరెస్ట్.
జనం వాయిస్, పోలవరం, ఫిబ్రవరి 13:
లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసులు ఏసీబీకి చిక్కిన ఘటన పోలవరం జిల్లాలో వెలుగుచూసింది. గంగారం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు ఓ కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్ చేసి రంగేహస్తం పట్టుబడ్డారు. వివరాల ప్రకారం, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త శివపై మొదటి భార్య కేసు నమోదు చేసింది. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబు కలిసి రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధితుడిని బెదిరించినట్లు తెలిసింది. డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు నటించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం డబ్బు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని ఇద్దరు పోలీసులను పట్టుకున్నారు. పట్టుబడ్డ ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనతో పోలీసు శాఖలో కలకలం రేగింది.