పెదమైణవానిలంక తీరక్షయం నివారణ పనుల పరిశీలించిన కేంద్ర ఆర్థిక మంత్రి
- దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు.
- అధికారులతో సమీక్ష, పురోగతిపై ఆరా.
- వచ్చే ఏడాది ఆరంభానికి పనులు పూర్తి లక్ష్యం.
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.
జనం వాయిస్, పశ్చిమ గోదావరి, డిసెంబర్ 28:
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైణవానిలంక గ్రామంలో కొనసాగుతున్న తీరక్షయం నివారణ ఎంబాంక్‌మెంట్ నిర్మాణ పనులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో చర్చించి, జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నేళ్లుగా సముద్ర తీరక్షయం వల్ల పెదమైణవానిలంక గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఎంబాంక్‌మెంట్ ప్రాజెక్టు గ్రామ ప్రజలకు రక్షణ కవచంగా నిలవనుందని తెలిపారు. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ తీరక్షయం నివారణ ప్రాజెక్టును కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని తెలిపారు. శాస్త్రీయ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు కొనసాగుతున్నాయని, జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్మాణం సాగుతోందని అధికారులు వివరించారు. ఈ విధానం భవిష్యత్తులో ఇతర తీరప్రాంత గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేసి గ్రామ ప్రజలకు భద్రత కల్పించాలని మంత్రి సూచించారు. వచ్చే ఏడాది ప్రారంభానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తీరప్రాంత ప్రజల జీవితాల్లో భద్రత, స్థిరత్వం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.