janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:43 am Digital Edition : JANAM VOICE

భారంగా కూరగాయల ధరలు..!

కూరగాయల ధరలు మంట..!

జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 16:

సామాన్యుల వంటింట్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగి భారంగా మారాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న ధరలు అకాల వర్షాలు, వేసవి తీవ్రత కారణంగా పెరిగి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంటలు దెబ్బతినడంతో మార్కెట్‌కు సరఫరా తగ్గిపోవడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రధాన రైతు బజార్లలో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల వరకు కిలో రూ.10 వద్ద లభించిన టమాటా ధర ఇప్పుడు రూ.23కు చేరింది. అలాగే బీన్స్ కిలో రూ.60, బెండకాయ రూ.35కు అమ్ముడవుతున్నాయి. సరఫరా మరింత తగ్గితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విజయవాడలో టమాటా కిలో రూ.28కు చేరగా, గుంటూరులో రూ.22 వద్ద ఉంది. అల్లం, వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగి సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా మారుతున్నాయి.
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోవడం, ఎండల తీవ్రతతో పూత రాలిపోవడం వంటి కారణాల వల్ల దిగుబడి తగ్గిపోయిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనితో మార్కెట్‌కు వచ్చే లోడ్లు తగ్గి ధరలు పెరుగుతున్నాయి.
కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా అధికంగా ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలపై భారం మరింత పెరుగుతోంది. నెలవారీ ఖర్చులు పెరగడంతో గృహ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. పరిస్థితులు మెరుగుపడకపోతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.