ఇప్ప పువ్వు ఎక్కడ దొరుకుంది? ఎలా సేకరిస్తారు..?
-ఇప్ప పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న పీక్ టైమ్‌లో ఇప్ప పువ్వు ప్రస్తావన, సభలో రేపిన దుమారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేసింది. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, క్షమాపణల డిమాండ్‌లతో నిండు సభలో ఇప్ప చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప పువ్వు ప్రత్యేకత చాలా మందికి తెలియదు. ఇప్ప సారా పేరు వినే ఉంటారు, కొంతమంది ఇప్ప సారా రుచిని ఆస్వాదించి ఉంటారు. కానీ ఇప్ప పువ్వు అంటే కేవలం సారా మాత్రమే కాదు. ఇప్ప పువ్వు అంటే తెలంగాణ గిరిజనుల జీవనాధారం, ఆకలితో కడుపు మాడ్చుకునే అడవి బడ్డలకు ప్రకృతి ప్రసాదించిన అమృతాహారం.తెలంగాణలోని ములుగు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని గిరిజన తండాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇప్ప పువ్వు విరివిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఉట్నూరు ఏజెన్సీలో ఇప్ప పువ్వుకు ఉండే క్రేజే వేరు. వేసవి కాలంలో ఇప్ప చెట్ల నుంచి ఇప్ప పువ్వులు రాలుతుంటాయి. అందుకే వేసవిని గిరజనులు ఇప్ప సీజన్‌గా పిలుస్తుంటారు. ఇప్ప చెట్లు చూసేందుకు మర్రి చెట్టు మాదిరి మహా వృక్షాల్లా ఉంటాయి. ప్రతీ కొమ్మకూ ఇప్పపువ్వులు విరగబడి పూస్తుంటాయి. చెట్టు ఎక్కకుండా నేలపై రాలిన ఇప్ప పువ్వులను మాత్రమే గిరిజనులు ఏరుతుంటారు. రాత్రంతా చెట్ల నుంచి రాలిన ఇప్ప పువ్వులను ఏరేందుకు వందల మంది గిరిజనులు ,భార్య పిల్లలతో కలసి తెల్లవారుజామున 4గంటలకు నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో అడవి లోపలికి వెళతారు. సుమారు 8 నుంచి 10 కిలోమీటర్లు అడవిలోకి వెళితే తప్ప ఇప్ప చెట్లు కనిపించవు. అలా చెట్ల కింద రాలిన పువ్వులను ఏరుకుని , తిరిగి మధ్యాహ్నం 2గంటల సమయానికి ఇంటికి చేరుకున్న తరువాత మాత్రమే భోజనం చేస్తారు. అలా నెలలో 20రోజులపాటు ఇప్ప దొరికితేనే ఆరోజు గిరిజన బిడ్డల కడుపునిండేది.
కిలో ఇప్ప పువ్వు ధర ఎంతంటే..?
ఇప్ప పువ్వును సేకరించిన తరువాత నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఎండబెట్టి, ఎండు ద్రాక్ష రంగులోకి మారిన తరువాత బస్తాలలో తొక్కి పెట్టి నిల్వ ఉంచుతారు. అలా ఎండబెట్టిన పువ్వు సంవత్సరంపాటు నిల్వ ఉంటుంది. అడవిలో నిర్వహించే సంతల్లో ఒక్క కిలో ఇప్ప పువ్వు 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతుంటారు గిరిజనులు. క్వింటా ఇప్ప పువ్వు 5 నుంచి 6వేల రూపాయలకుపైగా ధర పలుకుతుంది.
ఇప్ప పువ్వు ప్రయోజనాలు ఏంటి?
ఇప్ప పువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వివిధ ఆయుర్వేద మందుల తయారీలోనూ ఇప్ప పువ్వును ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇప్ప పువ్వు రసం తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తొలిగిపోతాయి. ఇప్ప పువ్వును నీటిలో మరిగించి, ఆ నీటిని నోటిలో పుక్కిలి పట్టడం వల్ల నోటి పూత తగ్గుతుంది. ఇప్ప పువ్వు ఆయిల్ కీళ్ల నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఇప్ప పువ్వు రసంతో చర్మంపై దద్దుర్లు, దురద తగ్గుతాయి. ఇప్ప పువ్వుతో చేసే లడ్డూ, కుడుములతోపాటు వివిధ రకాల స్వీట్స్, గిరిజన వంటలు రుచిలో అద్భుతంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఓ వరం.
ఇప్ప సారా తయారీ విధానం, ఆరోగ్యంపై ప్రభావం
అటవీ ప్రాంతాల్లో నిత్యం ఇప్పసారా కాయడం గిరిజన గ్రామాల్లో సర్వసాధారణం. వారం వారం నిర్వహించే గిరిజన సంతల్లో ఇప్ప సారాకు ఉండే ప్రత్యేకతే వేరు. మహానగరాలు, పట్టణాలతోపాటు దూర ప్రాంతాలను నుంచి సైతం ఇప్పసారా తాగేందుకు గిరిజన గ్రామాలకు క్యూ కడుతుంటారు. అంతలా ప్రత్యేకమైన ఇప్పసారా తయారీ విధానం వినూత్నంగా ఉంటుంది. ఎండబెట్టిన ఇప్ప పువ్వులను కడిగి రెండు లేదా మూడు రోజుల పాటు ఓ పాత్రలో నానబెడతారు. ఏ మాత్రం కదలకుండా ఇప్ప నీటిని పులయబెట్టిన తరువాత , ఓ పెద్ద పాత్రలో ఉంచి కట్టెల పొయ్యిపై కుండపైన కుండ పెడతారు. పులయబెట్టిన ఇప్పపువ్వు నీటి ఉంచిన పాత్ర కింద మంటపెడుతూ, ఆ పాత్రపైన మరో ఖాళీ కుండకు మధ్యలో సారా బయటకు వెళ్లేలా పైపు అమరుస్తారు. మట్టిపాత్రపైన మరో నీటి కుండను పెట్టి మంటపెడతారు. పులియబెట్టిన ఇప్ప పువ్వునీరు ఆవిరిగా మారి మధ్య కుండకు ఏర్పాటు చేసిన పైపు ద్వారా బయటకు వస్తుంది. అలా వచ్చే ఇప్పసారాను ఫైనల్ గా మరో పాత్రలోకి సేకరిస్తారు. ఇలా సేకరించిన ఇప్పసారా రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యంపై ఇప్పసారా చెడు ప్రభావం చూపనప్పటికీ, సారా సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్ప సారా తాగడకుండా గిరిజనులే ఉండలేరు. ఇప్పసారా అంటే వీరి సంస్కృతిలో భాగం.