భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!
మహబూబాబాద్ / జనం వాయిస్ :
వివాహేతర సంబంధం ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. ప్రియుడి మోజులో పడి, కట్టుకున్న భర్తనే కాలయముడిగా మారి అంతమొందించిందో భార్య. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, పోలీసుల చాకచక్యంతో చివరకు కటకటాలపాలైంది. ఈ ఘోర కలియుగ ఘటన హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చంద్యాతండా (తట్టుపల్లి) గ్రామానికి చెందిన బోడ నర్సింగ్ (33)కు, స్వరూప అనే మహిళతో 2008లో వివాహమైంది. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఎల్‌బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఓ అద్దె ఇల్లు తీసుకుని, నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గొడవలే కారణం..,
కొంతకాలంగా స్వరూపకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం భర్త నర్సింగ్‌కు తెలియడంతో దంపతుల మధ్య గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన స్వరూప, ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని క్రూరమైన పథకం వేసింది. శనివారం సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఛాతీపై కూర్చొని.. చున్నీతో బిగించి..,
రాత్రి సమయంలో భర్తతో ఏకాంతంగా ఉన్న సమయంలో స్వరూప తన ప్లాన్‌ను అమలు చేసింది. నర్సింగ్ గమనించేలోపే అతడి ఛాతీపై కూర్చొని, చున్నీతో గొంతు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఆ హత్యను ఆత్మహత్యగా నమ్మించేందుకు మృతదేహాన్ని మంచానికి చున్నీతో కట్టి ఉరివేసుకున్నట్లుగా నాటకమాడింది. ఆపై ఏమీ తెలియనట్లు తానే స్వయంగా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది.
పోస్ట్‌మార్టం నివేదికతో గుట్టురట్టు..,
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే తమ్ముడి మృతిపై నర్సింగ్ అన్న బిచ్యానాయక్‌కు తీవ్ర అనుమానాలు రావడంతో ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఉస్మానియా వైద్యులు అందించిన శవపరీక్ష నివేదికలో నర్సింగ్‌ది ఆత్మహత్య కాదని, గొంతు నలిపి ఊపిరాడకుండా చేయడం వల్లే చనిపోయాడని తేలింది.
అల్కాపురి వద్ద అరెస్ట్..,
భర్త చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక స్వరూప తన ప్రియుడికి ఫోన్ చేసి, ఇద్దరూ కలిసి పారిపోవాలని ప్లాన్ చేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో నిందితురాలి కోసం గాలించారు. చివరకు ఎల్‌బీనగర్ సమీపంలోని అల్కాపురి వద్ద ఆమెను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా, తానే భర్తను చంపినట్లు స్వరూప నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను రిమాండ్‌కు తరలించారు. తల్లి జైలుపాలు, తండ్రి మరణించడంతో ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు అనాథలయ్యారు. పెద్ద కుమార్తె వరంగల్ గురుకులంలో పదో తరగతి పూర్తి చేయగా, చిన్న కుమార్తె హయత్‌నగర్‌లో 8వ తరగతి చదువుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.