janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 10:00 am Digital Edition : GATTU MAHESH

అమరావతిలో డబ్ల్యూపీఓ ఆంధ్ర మేధోసంపత్తి అకాడమీ: సీఎం చంద్రబాబు నాయుడు.

అమరావతిలో డబ్ల్యూపీఓ ఆంధ్ర మేధోసంపత్తి అకాడమీ: సీఎం చంద్రబాబు నాయుడు.

– డబ్ల్యూపీఓ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో కీలక భేటీ.
– స్టార్టప్‌లకు మేధోసంపత్తి శిక్షణపై చర్చ.
– 2029 నాటికి అమరావతి విశాఖను ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ క్లస్టర్లుగా తీర్చిదిద్దే లక్ష్యం.

జనం వాయిస్, దావోస్:

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్, మేధోసంపత్తి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ముందడుగు వేశారు. వరల్డ్ ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్తో జరిగిన భేటీలో రాష్ట్రంతో డబ్ల్యూపీఓ సహకారాన్ని మరింత విస్తరించడంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అమరావతిలో డబ్ల్యూపీఓ ఆంధ్ర మేధోసంపత్తి అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగింది. ఈ అకాడమీ ద్వారా స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలకు మేధోసంపత్తి విలువ నిర్ధారణ, పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు వంటి అంశాల్లో శిక్షణ అందించాలని సీఎం ప్రతిపాదించారు. ఇది రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతుగా డబ్ల్యూపీఓ గ్రీన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమగ్రంగా అనుసంధానించే అంశంపైనా చర్చ జరిగింది. గ్రీన్ టెక్నాలజీలు, స్వచ్ఛ శక్తి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు.
అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను ఉపయోగించి 2029 నాటికి అమరావతి, విశాఖపట్నం నగరాలను ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇన్నోవేషన్ క్లస్టర్లుగా నిలపాలనే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే ప్రభుత్వ దీర్ఘకాలిక దృష్టి అని ఆయన స్పష్టం చేశారు.