తప్పుడు మోతాదు.. తీరని నష్టం..!
- కంపెనీ ప్రతినిధుల తప్పుడు మోతాదు సూచనతో లక్షల పంట నష్టం
- లబోదిబోమంటున్న రైతు
- పంటను పరిశీలించిన ఏఈవో సరిత
- బాధిత రైతుకు న్యాయం చేయాలని రైతు, ప్రజా సంఘాల డిమాండ్.
మహబూబాబాద్, అక్టోబర్ 7 (జనం వాయిస్):
వ్యవసాయ రసాయనాల కంపెనీ ప్రతినిధులు సూచించిన మోతాదులో పురుగు మందును పిచికారీ చేసిన అనంతరం తన మిర్చి పంట దెబ్బతిందని మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బేతోలు భజన తండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులు సూచించిన అధిక మోతాదే పంట నష్టానికి కారణమై ఉండవచ్చని ఆయన ఆరోపించారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్చి పంటకు అవసరమైన పురుగు మందు కోసం ఆన్‌లైన్, ఫోన్ ద్వారా సంప్రదించగా హైదరాబాద్‌కు చెందిన ఎస్. కె రెడ్డి కెమికల్స్ (రంగారెడ్డి/హైదరాబాద్– భోరోన్ కంపెనీ) ప్రతినిధులు కొరియర్ ద్వారా మందు పంపించారు. మందు వినియోగానికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు సూచించిన మోతాదులోనే పిచికారీ చేసినట్లు రైతు తెలిపారు. సాధారణంగా ఎక్కువ పరిమాణంలో నీటిలో కలిపి పిచికారీ చేయాల్సిన మందును, తమకు సూచించిన విధంగా తక్కువ పరిమాణం నీటిలో కలిపి పిచికారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మందు పిచికారీ చేసిన కొద్దిసేపటికే మిర్చి మొక్కలు మాడిపోయి ఎండిపోవడం ప్రారంభించాయని, దీంతో పంటకు భారీగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
పంటను పరిశీలించిన ఏఈవో సరిత..,
పంట నష్టంపై రైతు జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వ్యవసాయ విస్తరణ అధికారిణి ఏఈవో సరిత ఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న మిర్చి పంటను పరిశీలించారు. పంట పరిస్థితి, వినియోగించిన మందు తదితర వివరాలను పరిశీలించి తదుపరి చర్యలకు అవసరమైన అంశాలను నమోదు చేసినట్లు తెలిసింది.
సమగ్ర విచారణకు డిమాండ్
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నల్లపు సుధాకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి రైతుతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతు ఆరోపణలపై వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, మందు మోతాదు, వినియోగ విధానం, పంట నష్టానికి గల కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని వారు కోరారు. విచారణలో కంపెనీ ప్రతినిధుల సూచనల వల్లే పంట నష్టం జరిగినట్లు తేలితే, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత రైతుకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూక్య రాంజీ, షేక్ ఖాదర్ బాబా, భూక్య అర్జున్, భూక్య మన్సూర్, గుగ్గులోతు హచనా తదితరులు పాల్గొన్నారు.