యూట్యూబర్ వైష్ణవి ని చంపిన తన భర్త హరిబాబు హత్య.
నిజామాబాద్ కూరగాయల విక్రయ ప్రాంతంలో హరిబాబుపై కత్తితో దాడి.
మృతుడు వైష్ణవి హత్య కేసులో నిందితుడు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
జనం వాయిస్, నిజామాబాద్, సెప్టెంబర్ 17:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద మల్టీప్లెక్స్ థియేటర్ సమీపంలో దారుణ హత్య చోటుచేసుకుంది. కూరగాయలు విక్రయించే ప్రాంతంలో హరిబాబు అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు థియేటర్ సమీపంలోని కూరగాయల విక్రయ ప్రాంతానికి వచ్చి, తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రెండో టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు. ఏసీపీ ప్రకాశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
వైష్ణవి హత్య కేసు కోణంలో దర్యాప్తు.
మృతుడు హరిబాబు ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి అని సమాచారం. ఈ నేపథ్యంలో గత కక్షల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ముగ్గురు నిందితులను గుర్తించేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.