EPAPER
Monday, February 16, 2026
Google search engine

ఎంగేజ్‌మెంట్ విషయం దాచిన హీరో..- డేటింగ్ పేరుతో మోసం చేశాడన్న మమతా మోహన్‌దాస్.

📰 Generate e-Paper Clip

ఎంగేజ్‌మెంట్ విషయం దాచిన హీరో..

– డేటింగ్ పేరుతో మోసం చేశాడన్న మమతా మోహన్‌దాస్.

జనం వాయిస్, సినిమా:

మమతా మోహన్‌దాస్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. టాలీవుడ్ ప్రేక్షకులకు ‘యమదొంగ’ సినిమాతో మరింత చేరువైన ఆమె, నటిగా మాత్రమే కాకుండా గాయని గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. మలయాళ చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన మమతా, తరువాత తెలుగు, తమిళ భాషల్లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుని ప్రేక్షకాదరణ పొందారు. సహజమైన నటన, అందమైన తెరపై కనిపించే తీరు, మృదువైన గాత్రం ఆమెకు ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరిచాయి. అయితే కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంలో తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. 2009లో క్యాన్సర్ నిర్ధారణ కావడం సినీ వర్గాలను కలిచివేసింది. దీర్ఘకాల చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆమెకు 2013లో మరోసారి అదే వ్యాధి తిరగబెట్టింది. అంతేకాకుండా విటిలిగో సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ కష్టకాలాన్ని అధిగమిస్తూ క్యాన్సర్ సర్వైవర్‌గా నిలిచి అనేక మందికి స్ఫూర్తిగా మారారు. కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మమతా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బహిరంగంగా పంచుకున్నారు. ప్రేమ, డేటింగ్ విషయాల్లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడిస్తూ, క్యాన్సర్ తర్వాత జీవితాన్ని సానుకూలంగా చూడాలని భావించానని చెప్పారు. మలయాళ పరిశ్రమకు చెందిన ఓ నటుడు తనను డేటింగ్‌కు ఆహ్వానించాడని, కుటుంబ సభ్యుల అనుమతితో ఆ పరిచయాన్ని కొనసాగించానని తెలిపారు. అయితే ఆ వ్యక్తికి అప్పటికే మరొకరితో నిశ్చితార్థం జరిగిన విషయం తర్వాత తెలిసిందని పేర్కొన్నారు. ఈ విషయం తనను మానసికంగా తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత మరో వ్యక్తితో పరిచయం ఏర్పడినా, అతను ప్రేమకంటే తన కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చాడని చెప్పడంతో ఆ బంధం కూడా ముగిసిపోయిందని తెలిపారు. ఈ అనుభవాలన్నీ తనకు జీవితంలో ముఖ్యమైన పాఠాలు నేర్పాయని, ఇప్పుడు తాను మరింత బలంగా మారానని మమతా పేర్కొన్నారు. వ్యాధులతో పోరాడి గెలవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో ఎదురైన నిరాశలను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!