EPAPER
Monday, March 30, 2026
Google search engine

గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు: సీఎం సమీక్ష.

📰 Generate e-Paper Clip

గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు: సీఎం సమీక్ష.

– బాసర నుంచి భద్రాచలం వరకు సమగ్ర అభివృద్ధి.

– టెక్నికల్ కమిటీతో క్షేత్రస్థాయి పరిశీలనలు.

– భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టి.

జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 29:

2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశ హాలులో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి విస్తృతంగా చర్చించారు.
పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన అన్ని పనులను సమయానికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, వాటిపై సీఎం పలు కీలక సూచనలు చేశారు. పుష్కరాల సమయంలో లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు ఇంజనీర్లతో ప్రత్యేక టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15 నుంచి 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ సమగ్రంగా పరిశీలించి పూర్తి అంచనాలతో మంత్రివర్గ ఉపసంఘానికి పంపించాలని సీఎం తెలిపారు. ఉపసంఘం ఆమోదించిన అనంతరం గోదావరి పుష్కరాల సమగ్ర ప్రణాళికపై మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. పారదర్శకంగా, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణతో పాటు రహదారి, రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని చెప్పారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై కూడా సీఎం ప్రత్యేకంగా చర్చించారు. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొని పుష్కరాల విజయవంత నిర్వహణకు తమ సూచనలు తెలియజేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!