యాంకర్ శివజ్యోతికి టీటీడీ కఠిన చర్యలు.
– ప్రసాద వ్యాఖ్యల దుమారం.
జనం వాయిస్,తిరుమల,నవంబర్ 27:
ప్రముఖ యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆమెపై కఠినంగా స్పందించినట్టు సమాచారం. భవిష్యత్‌లో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వినియోగించే ఆధార్ ఆధారిత నమోదు ప్రక్రియలో ఆమె వివరాలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో ఉండగా అన్నప్రసాదం పొందుతున్న సమయంలో శివజ్యోతి చేసిన “కాస్ట్లీ ప్రసాదం”, “రిచెస్ట్ బిచ్చగాళ్లం” వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆమె వెంటనే వీడియో ద్వారా క్షమాపణలు తెలిపారు. “నా మాటల వల్లభావోద్వేగాలు దెబ్బతిన్నవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదు” అని ఆమె వెల్లడించారు.అయినా, ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలను టీటీడీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుందని, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఆమె శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించకూడదనే నిర్ణయానికి చేరుకున్నట్టు వర్గాలు తెలిపాయి. ఆధార్ ఆధారిత స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఆమె వివరాలను బ్లాక్ చేసినట్లు అనధికార సమాచారం వెలువడుతోంది. అయితే ఈ విషయంపై టీటీడీ అధికారికంగా ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.
తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ గుర్తింపు పొందిన శివజ్యోతి ‘బిగ్‌బాస్’ షో తర్వాత మరింత ప్రజాదరణ సంపాదించారు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు, యూట్యూబ్ ద్వారా యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఈ వివాదం ఆమె వ్యక్తిగత, వృత్తి జీవితంపై ప్రభావం చూపే అవకాశముందని పలువురు విశ్లేషిస్తున్నారు.
శ్రీవారి అన్నప్రసాదం, ఆలయ సంప్రదాయాలు, భక్తుల భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే సందేశంగా ఈ ఘటన మారిందని పలువురు పేర్కొంటున్నారు. టీటీడీ తుది నిర్ణయంపై అధికారిక ప్రకటన కోసం భక్తులు, మీడియా వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments