మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల యత్నం?
గజ్వేల్–సిరిసిల్లలో భారీ పట్టివేతలు.
బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లలో మద్యం, నిత్యావసరాలు సీజ్.
జనం వాయిస్, తెలంగాణ:
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నిల్వ ఉంచినట్లు అనుమానిస్తున్న మద్యం, నిత్యావసర సరుకులను ఎన్నికల అధికారులు భారీగా సీజ్ చేశారు. ఈ పట్టివేతలు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, అలాగే కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల లో జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను ఆకర్షించేందుకు ముందుగానే సరుకులు నిల్వ ఉంచినట్లు అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత నివాసంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు మరియు నిత్యావసర సరుకులను గుర్తించి సీజ్ చేశారు. ఇవి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నిల్వ ఉంచినవిగా అధికారులు నమోదు చేశారు. ఇదే తరహాలో సిరిసిల్ల మున్సిపాలిటీ ఐదో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి దార్నం అరుణ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా, భారీగా లిక్కర్ నిల్వలు బయటపడ్డాయి. ఓటర్లకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే మద్యం దాచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఘటనలపై ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments