చైనా మాంజాతో మరో బాలిక మృతి.
కూకట్పల్లిలో ఐదేళ్ల బాలిక దుర్మరణం.
ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఘటన.
నిషేధం ఉన్నా రహస్య విక్రయాలు. కొనసాగుతున్నాయా?.
చైనా మాంజా ప్రాణాంతకమని హెచ్చరికలు.
జనం వాయిస్, హైదరాబాద్:
చైనా మాంజా కారణంగా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి లో ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మేడ్చల్ జిల్లా ఖాజీపల్లి నుంచి తండ్రితో పాటు ఇద్దరు కుమార్తెలు ద్విచక్ర వాహనంపై కూకట్పల్లికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివరాల ప్రకారం, వివేకానందనగర్ హైవే వద్ద చైనా మాంజా బాలిక నిష్విక మెడకు చుట్టుకుంది. ఒక్కసారిగా అదుపు తప్పి ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయాలవల్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాంజా ఎలా అక్కడికి చేరింది, ఎవరు విక్రయించారనే అంశాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా మాంజా సాధారణ నూలు దారం కాదని అధికారులు మరోసారి హెచ్చరిస్తున్నారు. నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారయ్యే ఈ దారంపై గాజు ముక్కల పొడి పూయడం వల్ల ఇది పక్షుల రెక్కలు, మనుషుల నరాలను కోసేంత ప్రమాదకరంగా మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించినప్పటికీ, కొందరు రహస్యంగా విక్రయించడం వల్ల ఇలాంటి ప్రాణాంతక ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments