స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు.
– ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు.
– సీఐడీ ఫైనల్ రిపోర్ట్, కోర్టు ఉత్తర్వులు కోరుతూ వినతి.
– జనవరి 19న విచారణకు నిర్ణయం.
జనం వాయిస్, విజయవాడ:
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడుతో సహా 37 మంది నిందితులపై కేసును ముగించిన నేపథ్యంలో, ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీ పోలీసులు ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్ ప్రతులు, కేసు ముగింపుపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తనకు అందజేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు 54 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడు సెక్షన్ 164 ప్రకారం స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత కేసు ఏ విధంగా ముగిసిందన్న అంశంపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో వాదించారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరఫున మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ హాజరుకానున్నారు.
ఈ పిటిషన్‌ను జనవరి 19న విచారించనున్నట్లు ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే రోజున పిటిషనర్ తరఫున వాదనలు వినిపిస్తామని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఒకవేళ ఏసీబీ న్యాయస్థానం నుంచి అనుకూల ఉత్తర్వులు రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ న్యాయవాది వెల్లడించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments