సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
-పంచాయతీరాజ్ సిబ్బందికి జీతాల జాప్యం పై తీవ్ర అసంతృప్తి.
-నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్‌ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం.
-జీతాలు ఎక్కడా ఆగకుండా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ.
జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 10:
పంచాయతీరాజ్ సిబ్బంది జీతాలు, బిల్లుల విషయంలో కొందరు సర్పంచ్‌లు చూపుతున్న నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో జరిగిన మాటా మాంతీ కార్యక్రమంలో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ స్థాయిలో పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా సాగాల్సిన అవసరాన్ని పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొన్ని గ్రామాల్లో నెలంతా పని చేసినా సిబ్బంది జీతాలు ఆలస్యమవుతున్నాయని, సర్పంచ్‌లు సకాలంలో సంతకాలు చేయకపోవడంతో చెల్లింపులు నిలిపివేయబడుతున్నాయని పంచాయతీ రాజ్ సిబ్బంది పవన్ కళ్యాణ్‌కు వివరించారు. సర్పంచ్‌ల స్వేచ్ఛా నిర్ణయాల వల్ల పంచాయతీ సెక్రటరీలపై ఒత్తిడి పెరుగుతుందని, దీని ప్రభావం సిబ్బంది మరియు కార్మికులపై పడుతోందని వారు తెలిపారు. స్థాయి ఉద్యోగుల సమస్యలను పవన్ కళ్యాణ్ శ్రద్ధగా విన్నారు.
ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం, నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్‌ల జాబితా వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. “పని చేసిన వారికి జీతం ఆగకూడదు… ఎక్కడా అన్యాయం జరగకుండా చూసుకోవాలి” అని పవన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామస్థాయి పరిపాలనలో సమయపాలన అత్యంత కీలకమని కూడా ఆయన చర్చించారు. హెచ్చరిక చేసిన తర్వాత కూడా సర్పంచ్‌లు నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తే, అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడానికి పంచాయతీరాజ్ సిబ్బందికి పూర్తి మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కార దిశగా వెళ్లేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ అన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments