కేంద్ర బడ్జెట్లో ఏపీకి గుండు సున్నా : వైఎస్ షర్మిల.
విభజన హామీలకు దిక్కులేదు
ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు
పోలవరం, స్టీల్ ప్లాంట్లకు నిర్లక్ష్యం
రాష్ట్ర ఆత్మగౌరవంపై దాడి
జనం వాయిస్, అమరావతి:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 50 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి గుండు సున్నా మాత్రమే దక్కిందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రులను దగా చేసిన బడ్జెట్ అని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కేంద్రం అణగదొక్కిందని మండిపడ్డారు. బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షర్మిల, విభజన హామీల్లో ఒక్కదానికి కూడా దిక్కులేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా మాటే లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అంశాలన్నింటినీ బడ్జెట్ విస్మరించిందని విమర్శించారు. రాష్ట్ర జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించకపోవడం ద్వారా ప్రాజెక్టును అచేతనం చేశారని ఆరోపించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కనీస కనికరం కూడా చూపలేదని, కడప స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తి చూడలేదని షర్మిల మండిపడ్డారు. మెట్రో రైలు ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు వంటి అభివృద్ధి అంశాల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ఏ అంశాన్నీ కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.
అమరావతి రాజధాని నిర్మాణంపై కేంద్రం తీరును షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన రాజధానికి కేవలం రూ.1,500 కోట్ల అప్పు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్ర బాధ్యత కాదా అని ప్రశ్నించారు. గతేడాది ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్ల అప్పు ఏమైందని నిలదీశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కు కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచాలని రాష్ట్రం కోరుతున్నా, కేంద్రం 41.15 మీటర్లకే పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు మౌనంగా ఉండటం సిగ్గుచేటని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై స్పందించకపోవడమే ఆయన పాలనా తీరానికి నిదర్శనమని విమర్శించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments