EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

వెజ్ బిర్యాని లో చికెన్ ముక్కలు..-రూ.200 ఆర్డర్‌కు రూ.55 వేల జరిమానా.

📰 Generate e-Paper Clip

వెజ్ బిర్యాని లో చికెన్ ముక్కలు..

– రూ.200 ఆర్డర్‌కు రూ.55 వేల జరిమానా.
– ఫుడ్ డెలివరీ యాప్ నిర్లక్ష్యం.
– వినియోగదారుల మనోభావాలకు భంగం.
– కఠిన ఆదేశాలు జారీ చేసిన కమిషన్.

జనం వాయిస్, కర్నూలు, జనవరి 02:


వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలతో కూడిన ఆహారాన్ని డెలివరీ చేసిన ఘటనలో ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్, సంబంధిత రెస్టారెంట్‌కు కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం రూ.200 విలువైన బిర్యానీ విషయంలో జరిగిన నిర్లక్ష్యానికి ఏకంగా రూ.55 వేలు జరిమానా విధిస్తూ వినియోగదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వినియోగదారుల మనోభావాలు, ఆహారపు అలవాట్లను గౌరవించడంలో సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయని కమిషన్ స్పష్టం చేసింది.
కర్నూలు నగరానికి చెందిన పోచా రాజశేఖర్‌రెడ్డి కఠిన నియమాలు పాటించే శాకాహారి. ఇటీవల తన భార్య కోసం ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో చికెన్ ముక్కలు కనిపించడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెంటనే యాప్ నిర్వాహకులను సంప్రదించినా సరైన సమయంలో స్పందన లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్‌కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, నజీమా కౌసర్‌లు ఫిర్యాదుదారుడి వాదనను సమర్థించారు. తప్పుడు ఆహారాన్ని డెలివరీ చేయడం వల్ల ఫిర్యాదుదారుడి మతపరమైన విశ్వాసాలు, వ్యక్తిగత మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఇది కేవలం ఆర్డర్ తప్పిదం కాదని, వినియోగదారుడి హక్కులపై జరిగిన ప్రత్యక్ష దాడిగా పేర్కొంది.
ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ, సంబంధిత హోటల్ యాజమాన్యం కలిసి బాధితుడికి రూ.50 వేలు పరిహారంగా, మరో రూ.5 వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. తీర్పు వెలువడిన 45 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించకపోతే 9 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ఘటనపై రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు ధైర్యంగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చని ఈ తీర్పు స్పష్టంగా చాటిచెప్పింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!