EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల ఉద్యమాల ఆత్మస్ఫూర్తికి న్యాయం చేస్తాం.

📰 Generate e-Paper Clip

ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల ఉద్యమాల ఆత్మస్ఫూర్తికి న్యాయం చేస్తాం.

– ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం.
– ఓయూ అభివృద్ధికి ₹1,000 కోట్లు — మాస్టర్ ప్లాన్‌కు క్యూఆర్ కోడ్ విడుదల.
– విద్యలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలకే తెలంగాణ ప్రభుత్వ కట్టుబాటు.
– అంతర్జాతీయ ప్రమాణాలతో ఓయూను తిరిగి ప్రపంచ పటంపై నిలపాలన్న సీఎం సంకల్పం.


జనం వాయిస్, హైదరాబాద్:


ఉద్యమాల గర్వకేతనంలా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మరోసారి తన వైభవశిఖరాలకు చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమైన ముఖ్యమంత్రి, ఉద్యమకాలంలో ఓయూ–కేయూ విద్యార్థులు ఆశించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ అభివృద్ధికి ₹1,000 కోట్లు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఓయూ అభివృద్ధి మాస్టర్ ప్లాన్, డిజైన్‌లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ రూపంలో విడుదల చేసి, విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు.108 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశంలో 7వ స్థానంలో, దక్షిణ భారతదేశంలో 3వ స్థానం దక్కించుకున్న గౌరవాన్ని గుర్తుచేసిన సీఎం, “అభిమానంతో, గౌరవంతో ఓయూకి వచ్చా. ఇదే వేదిక నుండి భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తున్నాం.ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న సంకల్పం నాది” అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమమే కాక, ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారానికి విద్యార్థులే దారిచూపారని ఆయన అభిప్రాయపడ్డారు.“విద్య ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చగలదు. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. తల్లిదండ్రుల గర్వానికి కారణమవుతుంది. సమస్యలు ఎదురైనప్పటికీ నిలబడి పోరాడండి. మీలోనే రేపటి నాయకత్వం ఉంది. ప్రపంచాన్ని నడిపే శక్తి మీకు ఉందని నిరూపించండి” అని సీఎం యువతను ప్రోత్సహించారు.యూనివర్సిటీల్లో వివక్షను తొలగించేందుకు, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను చేపట్టినట్లు సీఎం తెలిపారు. “విద్యలో పెట్టే ఖర్చు భవిష్యత్తులో పెట్టుబడి. నైపుణ్యం, పరిశోధన, జ్ఞానం ఇవే భవిష్యత్తు పోటీ ప్రపంచానికి ఆయుధాలు” అని చెప్పారు.
యూనివర్సిటీల్లో నియామకాల్లో రాజకీయ జోక్యానికి చోటు ఉండదని సీఎం స్పష్టం చేశారు. “పైరవీలు, జోక్యాలు అస్సలు సహించం. పిల్లల భవిష్యత్తుతో ఎవరు ఆటలాడితే వారు ఇక్కడ ఉండరు. స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోండి” అని హెచ్చరించారు.సామాజిక న్యాయం అంశాలపై మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ సమస్యను పరిష్కరించిన రాష్ట్రం తెలంగాణేనని సీఎం పేర్కొన్నారు. బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య–ఉద్యోగ గణన పూర్తి చేసి, 2026 జనగణనలో కేంద్రం చేర్చేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. “బలహీన వర్గాలు, రైతులు, మహిళలు నిండుమనసుతో ఆశీర్వదించేందుకే నేను ఇక్కడ ఉన్నా. చరిత్రలో నిలిచే కార్యాలు చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నా” అని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అద్దలూరి లక్ష్మణ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.చిన్నారెడ్డి, సలహాదారులు కేశవరావు, వేమ నరేందర్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి, వైస్ చాన్సలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!