రివార్డ్ పాయింట్ల పేరుతో మోసాలు.
– లింకులు, క్యూఆర్ కోడ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరిక.
– నకిలీ యాప్‌లు, ఫిషింగ్ లింకులతో సైబర్ నేరగాళ్ల వల.
– అప్రమత్తతే రక్షణ: తెలంగాణ పోలీసులు.
జనం వాయిస్, హైదరాబాద్, జనవరి11:
రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు, క్యూపే పాయింట్లు, లాయల్టీ పాయింట్లు అంటూ వస్తున్న సందేశాలు, కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. ఇటువంటి మోసాల ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, క్యూఆర్ కోడ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా “రివార్డ్ పాయింట్లు త్వరలో గడువు ముగుస్తాయి” అనే సందేశాలతో ప్రజలను భయపెట్టి లింకులు క్లిక్ చేయిస్తున్నారని తెలిపారు.
డబ్బు పోతే తిరిగి పొందలేమని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే నష్టం జరుగుతుందని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి వివరాలు ఇవ్వకుండా వెంటనే కాల్ కట్ చేయాలని సూచించారు. బ్యాంకులు, అధికారిక సంస్థలు ఎప్పటికీ ఫోన్, సందేశాల ద్వారా వ్యక్తిగత వివరాలు అడగవని గుర్తుంచుకోవాలని తెలిపారు.
సైబర్ మోసాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా సైబర్ క్రైం విభాగాన్ని సంప్రదించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని, జాగ్రత్తే ఉత్తమ రక్షణ అని మరోసారి పోలీసులు గుర్తు చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments