గ్రామ పంచాయతీలకు శుభవార్త: స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ప్రకటించిన సీఎం
– 12,706 గ్రామ పంచాయతీలకు అదనపు నిధులు.
– సర్పంచులే గ్రామాభివృద్ధికి కీలకం
– కొడంగల్ ఆత్మీయ సమావేశంలో సీఎం దిశానిర్దేశం.
జనం వాయిస్, కొడంగల్, డిసెంబర్ 24:
తెలంగాణ రాష్ట్రంలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ఈ ప్రత్యేక నిధులు అందజేస్తామని సీఎం వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే వచ్చే నిధులకు ఇవి అదనమని స్పష్టం చేస్తూ, నూతన సంవత్సరంలోనే ఈ నిధులను విడుదల చేస్తామని తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ సర్పంచులకు ప్రజల్లో గౌరవం, మర్యాద పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేలా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిశాక పార్టీలు, పంథాలకు చోటు లేదని, ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడేనని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారనే కారణంతో గానీ, విభేదాల పేరుతో గానీ ఎవరి పట్ల వివక్ష చూపరాదని సూచించారు.
కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గీ కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులను సీఎం సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.3 వేల కోట్ల నిధులను తీసుకురావడం తన బాధ్యతగా తీసుకుంటానని ప్రకటించారు.
రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, మక్తల్–నారాయణపేట వంటి ప్రాజెక్టులు గతంలో పూర్తికాలేదని, చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. వాటన్నింటినీ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. చదువే నిరుపేదల జీవితాలను మార్చగల శక్తి అని పేర్కొంటూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సంక్షేమ కార్యక్రమాలపై సీఎం విస్తృతంగా మాట్లాడారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, ఇంకా ఎవరికి అందకపోతే సర్పంచులు ఇళ్లిళ్లు తిరిగి గుర్తించి జాబితా పంపించాలని సూచించారు. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్ పథకాల అమలుపై కూడా సర్పంచులు పర్యవేక్షణ చేయాలని కోరారు.
తెలంగాణ ఆడబిడ్డల కోసం కోటి ఇందిరమ్మ చీరల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీర అందాల్సిందేనని, ఎవరైనా మిగిలితే సర్పంచులు స్వయంగా పేర్లు నమోదు చేయాలని సూచించారు. కొడంగల్‌ను పారిశ్రామిక, విద్యా హబ్‌గా అభివృద్ధి చేస్తామని, 250 ఎకరాల్లో జూనియర్, డిగ్రీ, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీలు, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి దేశానికి మాడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు.
ఈ ఆత్మీయ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించినందువల్లే ఈ స్థాయికి వచ్చానని సీఎం భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments