థియేటర్లో తొలిసారి పడయప్ప.. నీలాంబరిగా రమ్యకృష్ణకు గూస్‌బంప్స్.
జనం వాయిస్, చెన్నై, డిసెంబర్ 22:
తమిళ సినీ చరిత్రలో ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రజనీకాంత్ చిత్రం పడయప్ప మరోసారి వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రజనీకాంత్ సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో తిరిగి విడుదల చేయగా, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించడమే కాకుండా, పాత్రల పరంగా కూడా చిరస్థాయిగా నిలిచింది.
రజనీకాంత్ సరసన సౌందర్య, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నీలాంబరి పాత్రకు వచ్చిన క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఆ పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోసిన తీరు సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. రీ రిలీజ్ సందర్భంగా తాజాగా రమ్యకృష్ణ స్వయంగా థియేటర్లో పడయప్ప సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ, జీవితంలో తొలిసారి ఈ చిత్రాన్ని థియేటర్లో చూడగలిగానని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ముఖ్యంగా నీలాంబరి అజ్ఞాతవాసం ముగించుకుని ఎన్నో ఏళ్ల తర్వాత నరసింహను ఎదుర్కొనే సన్నివేశం థియేటర్లో మరోసారి గూస్‌బంప్స్ తెప్పించింది. ఆ డైలాగులు, నేపథ్య సంగీతం, రజనీకాంత్ – రమ్యకృష్ణ నటన ప్రేక్షకులను మళ్లీ 1999కి తీసుకెళ్లాయి. ఆ సన్నివేశం వచ్చిన సమయంలో థియేటర్లో అభిమానులతో కలిసి రమ్యకృష్ణ కూడా అదే ఉత్సాహంతో స్పందించడం అక్కడున్న వారిని మరింత భావోద్వేగానికి గురి చేసింది.
ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. నీలాంబరి కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, ఒక లెజెండ్ అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. రీ రిలీజ్ అయినప్పటికీ పడయప్పకు వస్తున్న స్పందన చూస్తే, ఈ సినిమా నిజంగా కాలాతీతమైన క్లాసిక్ అని మరోసారి నిరూపితమవుతోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments