EPAPER
Thursday, April 2, 2026
Google search engine

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి.

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి.

– తుమ్మలూరు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న.

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు.

– జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి.

జనం వాయిస్, మహేశ్వరం, ఏప్రిల్ 02:

99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా వివరించారు. రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్ బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. అదే విధంగా నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం – ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులు  వారి అభిప్రాయాలను తెలియజేస్తూ.. ప్రజా ప్రభుత్వంలో నిరుపేద లైన తమకి వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సి.ఎస్. కలెక్టర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి సిఎస్ మాట్లాడుతూ 2047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. మనమందరం ఈ ప్రగతి పాలనలో భాగస్వాములం కావాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలతో పాటు, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అన్ని హాస్టళ్లు, స్కూళ్లలో డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ  ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.మహిళా సాధికారత కొరకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా  బలోపేతం చేయడం జరుగుతుందన్నారు.  గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని అన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా, గృహ జ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు.గ్రామ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలని అన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను లబ్ధిదారులకు సిఎస్ అందజేశారు. గ్రామసభ సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సిఎస్ కలెక్టర్ గారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, జిల్లా అధికారులు శ్రీలత,  సురేష్,  వనజాత, శ్రీలక్ష్మి, లలితా దేవి, తాసిల్దార్, ఎంపీడీవో, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!