తిరుపతిలో అత్యాధునిక రీసెర్చ్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్.
– ఏపీ ఫస్ట్ పేరుతో విజ్ఞాన–సాంకేతిక పరిశోధనల హబ్.
– సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.
– ఏరోస్పేస్, డిఫెన్స్, డిజిటల్ రంగాలకు ప్రాధాన్యం.
జనం వాయిస్, అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు కొత్త దిశగా అడుగులు వేస్తూ, ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ – ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏరోస్పేస్–డిఫెన్స్, ఐటీ–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల సలహాదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొని తమ సూచనలు, ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధన హబ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రి సమగ్రంగా పరిశీలించి అంగీకరించారు.
ఈ రీసెర్చ్ కేంద్రం ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ, డ్రోన్లు, ఐటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో వినూత్న పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, పరిశోధనావకాశాలు కల్పించడంతో పాటు, పరిశ్రమలతో అనుసంధానమై రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. తిరుపతి కేంద్రంగా రాష్ట్రంలోనే అతిపెద్ద రీసెర్చ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ఏరోస్పేస్–డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి, ఐటీ–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సలహాదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ పీఎస్ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీ ఫస్ట్ రీసెర్చ్ కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుపతి కేంద్రంగా ఏర్పడనున్న ఈ పరిశోధన హబ్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments