EPAPER
Monday, February 16, 2026
Google search engine

మద్యం కోసం ఆర్టీసీ బస్సే దొంగిలించాడు.

📰 Generate e-Paper Clip

మద్యం కోసం ఆర్టీసీ బస్సే దొంగిలించాడు.

– డీజిల్ అమ్ముకుని తాగాలనే ఉద్దేశంతో వింత దొంగతనం.
– సీసీటీవీ ఫుటేజీలతో నిందితుడి అరెస్ట్.
– గతంలోనూ ఇదే తరహా నేరం చేసినట్లు వెల్లడి.

జనం వాయిస్, విశాఖపట్నం:


విశాఖపట్నంలో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, టీవీ నాయుడు అనే వ్యక్తి తనకు చెందిన ఆరు బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. ఈ నెల 16న రాత్రి శ్రీకాకుళం నుంచి వచ్చిన ఏపీ 39 యూఎక్స్ 2888 నంబర్ గల బస్సును డ్రైవర్ అప్పారావు 197 లీటర్ల డీజిల్‌తో ఫుల్ ట్యాంక్ చేయించాడు. అదే రోజు రాత్రి 9:45 గంటల సమయంలో బస్సును మద్దిలపాలెం డిపోలోని పార్శిల్ కౌంటర్ పక్కన పార్క్ చేసి విశ్రాంతి కోసం వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వచ్చి చూడగా బస్సు అక్కడ కనిపించలేదు. దీంతో బస్సు యజమాని టీవీ నాయుడు, డ్రైవర్ అప్పారావు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మద్దిలపాలెం డిపోతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ దర్యాప్తులో యజమాని టీవీ నాయుడు వద్ద పనిచేస్తున్న అనకాపల్లి జిల్లాకు చెందిన ఈగల పైడిరాజు ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు సమాచారం అందింది. ఈ నెల 19న మధ్యాహ్నం రామా టాకీస్ సమీపంలోని ప్రభుత్వ కంటి ఆసుపత్రి దగ్గర సదరు బస్సును నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో తాను మద్యానికి బానిసనని, బస్సులోని డీజిల్‌ను అమ్ముకుని ఆ డబ్బుతో మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సును దొంగిలించినట్లు పైడిరాజు అంగీకరించాడు. ఇదే యజమానికి చెందిన బస్సును గతేడాది ఫిబ్రవరిలో కూడా దొంగిలించి డీజిల్ అమ్ముకున్న ఘటనలో ఇప్పటికే కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!