EPAPER
Thursday, March 19, 2026
Google search engine

తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు.

📰 Generate e-Paper Clip

తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలు.
ఉరుములు, వడగండ్ల వానలకు అప్రమత్తం కావాలంటూ హెచ్చరిక.
ఇప్పటికే పంటలకు భారీ నష్టం… రైతుల్లో ఆందోళన.

జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 19:

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌లో 8.7 మిల్లీమీటర్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16.1 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 9.6 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లాలో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా పత్తి, పుచ్చకాయ, మామిడి, జొన్న, బొప్పాయి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు ఆరబెట్టిన పెసర, పసుపు పంటలు కూడా తడిసిపోవడంతో నష్టం మరింత పెరిగింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు మరింత నష్టం కలిగించాయి. వీణవంక మండలంలో 260 ఎకరాల్లో మక్క పంట నేలకొరిగింది. శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది. కరీంనగర్ రూరల్ మండలంలో 20 ఎకరాల్లో మక్క పంట దెబ్బతింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో సుమారు 500 ఎకరాల్లో మక్క పంట నేలకొరిగినట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పంటలకు నష్టం వాటిల్లింది. కొందుర్గు మండలంలో మక్కజొన్న పంట దెబ్బతింది. ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని మండలాల్లో చేతికొచ్చిన మక్క నేలవాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో రైతులు ఆరబెట్టిన మక్కజొన్న, మిర్చి తడిసిపోయింది. ఈ పరిస్థితులపై వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కొనసాగితే పంటలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ సమాచారాన్ని నిరంతరం పరిశీలించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షిస్తూ, రైతులకు అవసరమైన సహాయం అందించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!